‘వీరశైవం’ ‘జంగమ దేవర’ ల జన్మస్తలం - చారిత్రిక విశేషాలు
కొలనుపాక..( కుల్యపాక ) శతాబ్దాల క్రితం ఓ సుందర నగరం. ఇప్పుడు అచ్చమైన పల్లెటూరు. యాదాద్రి భువనగరి జిల్లా ఆలేరు పట్టణానికి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది. వెయ్యేండ్లకు పూర్వమే ఓ వెలుగు వెలిగిన సాంస్కృతిక, ఆధ్యాత్మిక, రాజకీయ రంగస్థలి.
వీరశైవ మత వ్యాప్తి
వీరశైవ మత వ్యాప్తి కోసం శివుని పంచముఖాల నుంచి రేవణసిద్ధ (బాళెహొణ్నూరు పీఠం), మరులసిద్ధ (ఉజ్జయిని పీఠం), ఏకోరామ (కేదారనాథ్ పీఠం), మల్లికార్జున పండితారాధ్య (శ్రీశైల పీఠం), విశ్వారాధ్య (కాశీ పీఠం) ఉద్భవించినట్టు శైవాగమాలు పేర్కొంటున్నాయి. స్వయంభువులుగా భావించే ఈ శివాచార్యులను ‘వీరశైవ పంచాచార్యులు’గా కీర్తిస్తారు. పంచాచార్యులలో ప్రథముడైన రేవణసిద్ధ (రేణుకాచార్యులు) కొలనుపాకలో స్వయంభూ సోమేశ్వర లింగం నుంచి ఉద్భవించినట్టు స్వయంభువాగమం చెబుతున్నది. శైవాగమాలలోని వీరాగమ, సుప్రభేదాగమాలు రేణుకాచార్యులను ప్రస్తావించాయి.
సిద్ధాంతాలు
శివయోగి శివాచార్య వీరశైవ తత్వాన్ని సంగ్రహించి, రేణుకాచార్య ఉపదేశించిన శక్తి విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని వివరిస్తూ ‘సిద్ధాంత శిఖామణి’ అనే సంస్కృత గ్రంథాన్ని రాశారు. శక్తి విశిష్టాద్వైతం రేణుకాచార్యులు ప్రబోధించిన ఆధ్యాత్మిక సిద్ధాంతం. కాబట్టే దీనికి ‘రేణుకా గీత’ అని పేరు. శివాజ్ఞతో రేణుకాచార్య ‘శక్తి విశిష్టాద్వైతాన్ని’ స్థాపించాడు. ఈ సిద్ధాంతాన్నే ‘వీరశైవం’ అంటారు.
సాంఘిక విప్లవం
ఆ కాలంలో.. ఆరాధ్య శైవంలో దేవాలయంలోకి నిమ్న కులాలకు అనుమతి లేదు. ఈ అస్పృశ్యతే అసంఖ్యాక ప్రజలను శైవానికి దూరం చేసింది. అవైదిక మతాలకు ఆకర్షితులవుతున్న ప్రజలను నిలువరించేందుకు రేణుకాచార్యులు శైవాన్ని సంస్కరించారు. అన్ని కులాల వారికి శివదీక్ష ఇచ్చారు. వీరశైవులతో లింగాన్ని ధరింపజేశారు. ఇష్టలింగాన్ని ధరించిన వాళ్లను ‘జంగమ దేవర’ అంటారు.
మత వ్యాప్తి
జంగమవారే కర్మ కాండలు, వివాహాది శుభకార్యాలు నిర్వహించేలా ప్రోత్సహించారు. దీంతో అష్టాదశ కులాల వారిని వీరశైవం బాగా ఆకట్టుకుంది. జంగమ దేవరలు శుభాశుభాలు పలుకుతూ వీరశైవ మతవ్యాప్తికి పాటుపడ్డారు. అలా, వీరశైవం ప్రజాదరణ పొందింది. రేణుకాచార్యుల కృషితో తెలుగు, కన్నడ నేలపై వీరశైవం ఓ ఉద్యమంలా వ్యాపించింది.
ఓ ఉద్యమంలా వ్యాపించింది. అదో ‘సాంఘిక విప్లవం’. రేవణసిద్ధ ప్రతి కులానికీ ఓ వీరశైవ మఠాన్ని ఏర్పాటుచేశాడు. ఈ మఠాల పుణ్యమాని అష్టాదశ కులాల ప్రజలంతా శివారాధకులు అయ్యారు. రేవణ సిద్ధేశ్వర స్వామి వీరశైవ మతవ్యాప్తి కోసం దేశమంతా తిరిగారు. కదళీపురం (బాలెహళ్లి)లో వీరసింహాసన (రంభాపురి) పీఠం స్థాపించారు. రేవణసిద్ధులు కుల్యపాకలోనే సోమేశ్వరలింగంలో ఐక్యమయ్యారని ఐతిహ్యం.
కన్నడ దేశపు కాలచూరిని ఏలుతున్న బిజ్జలుని మంత్రి బసవన్న వీరశైవ వ్యాప్తికి కృషిచేశాడు. రేణుకాచార్యులు కొలనుపాకలో వీరశైవాన్ని అభివృద్ధి చేశాడు. వీరశైవం తెలుగు నేలపై రాజాదరణ పొందింది. కాకతీయల ప్రోద్బలంతో ఉచ్ఛస్థితికి చేరింది. శైవాలయాలు, శైవపీఠాలు, శైవమఠాల నిర్మాణాలకు కాకతీయులు సహకరించారు. కొలనుపాకలోని కోటిలింగాల గుడి, ప్రతాపరుద్ర ఆలయం కాకతీయులు కట్టినవే. సోమనాథుడికి రాణి రుద్రమ పూజలు చేసినట్లు, తన భర్త చాళుక్య వీరభద్రుడికి కొలనుపాక ప్రాంతాన్ని అరణంగా ఇచ్చినట్లు శాసనాల్లో పేర్కొన్నారు.
మఠాల స్థాపన
రేవణ సిద్ధేశ్వరుల ప్రభావంతో కొలనుపాకలో అన్ని కులాల వాళ్లూ వీరశైవంలో చేరారు. ప్రతి కులం ఒక మఠాన్ని ఏర్పాటు చేసుకుంది. అష్టాదశ కులాల వారికి కొలనుపాకలో మఠాలున్నాయి. ప్రస్తుతం ఆ కులమఠాల సంఖ్య పద్దెనిమిది కంటే ఎక్కువే. తర్వాతి కాలంలో ఏర్పడిన కులాలు కూడా వీరశైవాన్నే అనుసరిస్తూ కొత్తగా మఠాలను ఏర్పాటు చేసుకుని ఉండొచ్చు.
కొలనుపాకలోని మఠాల నిర్మాణ శైలి భిన్నంగా ఉంటుంది. వీటన్నిటిలో శివలింగం, నంది విగ్రహం మాత్రమే ఉంటాయి. మరో విగ్రహానికి కానీ, ఇంకో దేవుడికి కానీ ఇక్కడ స్థానం లేదు. ఈ మఠాల నిర్వహణ, పూజా విధానాల్లో ఎంతో సారూప్యం కనిపిస్తుంది. ప్రతి కులమఠానికి ఒక గురువు, కులపెద్ద బాధ్యులుగా ఉంటాడు. మఠ గురువు, మఠ పెద్ద, సభ్యులైన వీరశైవులు ఇష్టలింగాన్ని ధరిస్తారు. నిత్యం మఠంలోని శివలింగాన్ని కడిగి, పత్రి, పుష్పాలతో పూజ చేసి, నైవేద్యం పెడతారు. ఆ తర్వాతే భోంచేస్తారు.
గురువుల ప్రధాన బాధ్యత
మఠాలన్నిటికీ జంగమ దేవరలే గురువులు. ‘గురువు’ అంటే విద్యా బోధన చేసేవాడని అర్థం. మత బోధన మఠం ప్రధాన బాధ్యత. వీరశైవం వైపుగా ఆకర్షితులైన నిమ్న కులాల వారికి వీరశైవ తత్వాన్ని, మోక్ష మార్గాన్ని బోధించేందుకు ఆ కులానికే చెందినవారికి ఇక్కడ శిక్షణ ఇచ్చేవారు. కొలనుపాకలోని కులమఠాలన్నీ రంభాపురి పీఠాన్ని అనుసరిస్తాయి. కులమఠాలకు ఉన్నట్లుగా పెద్ద మఠానికి ప్రత్యేకమైన కట్టడం ఏమీ లేదు. పెద్ద మఠం గురువుని కులమఠాలన్నీ అనుసరిస్తాయి. ప్రస్తుతం పెద్ద మఠం గురువుగా జంగమదేవర శంకరయ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
అందరికీ శివుడే ఆరాధ్య దైవం. ఆ దేవుడిని కూడా తమ కులంవాడిని చేసుకోవడం మఠాల ప్రత్యేకత. కులమఠాల వాళ్లు ఎవరికి వారు.. తమ కులానికి అనుగుణంగా శివుడికి నామకరణం చేశారు. సురాభాండాన్ని తీసే గౌడవారు శివుడిని ‘సురాభాండేశ్వరుడు’ అని పిలుచుకుంటున్నారు. కోమట్లు ‘నగరేశ్వర స్వామి’ అని కొలుస్తున్నారు. మేదర మఠంలోని శివుడిని ‘కేతేశ్వర స్వామి’గా వ్యవహరిస్తారు, అదే ఆదిదేవుడు మేరు మఠంలో ‘శంకర దాసమయ్య’ అయ్యాడు.
కొలనుపాక ఒకప్పుడు ఏడు వేల గ్రామాలకు రాజధాని. ఆ గ్రామ ప్రజలకువీరశైవ తత్వాన్ని బోధించి, మోక్షమార్గాన్ని అనుసరించేలా చేయడం కుల గురువుల బాధ్యత. ఆచార్యుల బతుకుదెరువు, కులమఠంలోని సన్యాసుల పోషణ, శివ పూజల నిర్వహణ కోసం ఏడువేల గ్రామాలవారు ధనం, ధాన్యం ఇచ్చేవారు. కాబట్టే, కులమఠాల్లో ధూపదీప నైవేద్యాలకు లోటు రాలేదు. శివరాధన, వీరశైవ బోధన నిరాటంకంగా కొనసాగింది.
కొలనుపాకలో కులం ప్రాతిపదికగా ఏర్పాటు చేసిన మఠాలు మొత్తం ఇరవై రెండు. మరే పట్టణంలోనూ ఇన్ని మఠాలు లేవు. శ్రీశైలంలో పదమూడు మఠాలుండేవని శాసన, సాహిత్య ఆధారాలు చెబుతున్నాయి. కొలనుపాకలో ఇప్పటికీ 22 మఠాలు నిలిచి ఉన్నాయి. వీరశైవ వ్యాప్తి కోసం కులమఠాలను ఏర్పరిచారు. కులమఠాలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కేంద్రాలుగానే కాక సామాజిక సమస్యలను పరిష్కరించే వేదికలు కూడా. ప్రతి కులం వాళ్లు తమ మఠం దగ్గర సమావేశమై, తమతమ సమస్యలు చర్చించుకునేవారు. వివాదాలు పరిష్కరించుకునేవారు. అప్పట్లో మఠాలు బ్యాంకులుగానూ పనిచేశాయి.
కొలనుపాక స్వయంభూ సోమేశ్వరాలయంలో ఆయుర్వేద వైద్య చికిత్స కూడా చేసినట్లుగా ఆధారాలున్నాయి. నాడు పసరు తీయడానికి, చూర్ణం చేయడానికి నూర్పిడి చేసిన రాతి ఆనవాళ్లు ప్రధాన మండపంలో కనిపిస్తాయి.
దక్షిణ కాశి
కొలనుపాక దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందింది. కొలనుపాక సమీపంలో ‘కాశీ బుగ్గ’ అనే నడబావి ఉన్నది. దానికి పక్కనే చిన్న శివాలయం కూడా ఉంది. శివభక్తులు కాశీ బుగ్గలోని నీటిని అపర గంగగా భావిస్తారు. ఈ గుడిలోని శివుడిని అపర (కాశీ) విశ్వేశ్వరుడిగా కొలుస్తారు. కాశీ బుగ్గను దర్శించుకుంటే వారణాసిని దర్శించుకున్నట్లేనని శైవుల భావన. ఒకప్పుడు కులమఠాల్లో జరిగే శివపార్వతుల కల్యాణ వేడుకను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి వచ్చిన శివభక్తులు తమతమ కులమఠాల్లో జాగారం చేసేవారు.